13, మే 2020, బుధవారం

నాకు తెలియనే తెలియదు
నిన్నటి నా సంతోషాలు
నువ్వు వదిలేసాక ఇంతలా వెలివేస్తాయని

నాకు తెలియనే తెలియదు
నేను ఆశపడి కట్టుకున్న బొమ్మరిల్లు
నువ్వు వెళ్ళిపోగానే కూలిపోతుందని

నాకు ఎవరూ చెప్పనే లేదు
లోకమంతా తెల్లారినా
నేను మాత్రం చీకటిలోనే బ్రతుకుతానని

నాకు ఎవరూ చెప్పనే లేదు
నలుగురిలో నవ్వే కళ్ళు
ఒంటరిగా కురిసీ కురిసీ అలసిపోతాయని

కానీ ఇవి అన్ని జరుగుతూ ఉండగా చూసిన మౌన సాక్షిని నేను...
వీటన్నిటికి కారణం అయిన ప్రేమ ముద్దాయివి నీవు...

3, నవంబర్ 2019, ఆదివారం

చుక్కల వంటి నీ కళ్ళను చూస్తూ నా రెప్పలు ఓడిన క్షణాలు
నిశ్శబ్ద నది లాంటి నా మనసులో నీ మాటలు సృష్టించిన తరంగాలు
చిలిపి కోపాల చింతల మంటలలో ఎద కాచుకున్న ఆనవాలు
కవ్వించే ఆ నవ్వుల లో సమాధి అయిన పంతాలు
నీవు పీల్చిన గాలి నన్ను తాకిన జ్ఞాపకాలు
ఇలా... నీ అనంతమూ నాలో పదిలమే సుమా!!!