5, జులై 2018, గురువారం

అమ్మ పిచ్చిది
చందమామ రాదని తెలిసినా పిలుస్తునే ఉంటుంది
అమ్మ వెర్రిది
నాకు మాటలు రావని తెలిసి తానూ నాలాగే మాట్లాడుతుంది
అమ్మ మూర్ఖురాలు
ఎప్పుడూ నా విషయం లో నాన్నతో వాదిస్తుంటుంది
అమ్మ కోపిస్టిది
నన్ను ఎవరన్నా ఎమన్నా అంటే వాళన్ని తిడుతుంది
అమ్మ చెవిటిది
నేను ఎన్నిసార్లు కసురుకున్నా వినిపించదు
అమ్మ స్వార్ధపరురాలు
ఎంత సేపూ పిల్లలు బాగుండాలి అనే కోరుకుంటుంది

Note: ఇన్ని చెడు లక్షణాలు ఉన్న అమ్మను నేను ఎలా పొగడను! అయినా అమ్మకు పిల్లలు చెప్పింది వినడం కన్నా పిల్లలు గురించి చెప్పింది వినడమే ఇష్టం! అందుకే నేను నిన్ను పొగడను!!! నన్ను క్షమించు అమ్మ!!!

30, మే 2018, బుధవారం

సరోగసీ నిర్మూలన 

ఆకలి కడుపుకు
ఆశగా రూపాయి రుచిని చూపించి

అద్దెకు గర్భమని
అభాగ్యులకు వరమని నమ్మించి

అంగడి సరుకులాగా
అమ్మతనాన్ని అమ్మించి

ఆర్ధికంగా అంచెలంచెలుగా పైకి ఎగబాకిన దళ్ళారులారా మేలుకోండి ఇకనయినా
అమ్మంటే అమృత కలశమని తెలుసుకోండి ఎప్పుటికయినా

కొన్ని క్షణాలే 
నేను నిన్ను చూసింది కొన్ని క్షణాలే 

కోపాన్ని, కొంత మొహాన్ని 
మౌనాన్ని, మాటల ప్రవాహాన్ని 
ప్రేమని, పరిహసించే హాస్యాన్ని

నేను నీ కళ్ళ లో చూసింది కొన్ని క్షణాలే 

మరి 
దేనికోసం ఈ శోధన... 
దేనికోసం ఈ వేదన... 

కత్తుల్లాంటి ఆ కళ్ళ కోసమా???
మురిపించే నీ మాట కోసమా!!!

4, ఏప్రిల్ 2015, శనివారం

ఎదలయల శృతుల్లో అపశృతులు దొర్లుతుంటే
తారా స్థాయిలో వేదన వినిపించాలి అని ఉన్నా
మనస్సు సవరించి
ఆనంద రాగం ఆలపించే ప్రయత్నం చేస్తున్నా
తెగిపడిన తీగలని సరిచేసుకుంటూ
మరచిపోయిన స్వస్థానాన్ని గుర్తు చేసుకుంటూ
అలనాటి ఆనందపు గమకాల్ని నెమరేసుకుంటూ
మౌన రాగం మీటుతున్నా!!!

6, ఫిబ్రవరి 2015, శుక్రవారం

వనితను నేను
వేధింపులకు విడిదిని కాను
విద్య నేర్చిన వినయాన్ని
ఆడదాన్ని నేను
అంగడి సరుకును కాను
అమ్మతనపు ఆత్మీయతను
పడతిని నేను
పడటింట బొమ్మను కాను
ఇంతిని నేను
ఇంటి పనిమనిషిని కాను
ఈ దేశపు గౌరవాన్ని
రాముడి వెంట సీతను నేను
కృష్ణుడి వేబ్త సత్యను నేను
మౌనంగా భారించినా
ధైర్యంగా ఎదిరించినా
చల్లని చూపుల సిరి గల తల్లిని నేను
స్త్రీ శక్తి ని నేను!!!

1, నవంబర్ 2014, శనివారం

విశాఖను నేను
మహా సుందర నగరాన్ని
సముద్రపు సవ్వళ్ళతో
పచ్చదనపు నవ్వులతో
పలకరించే నేస్తాన్ని
విశాఖను నేను
లక్షల జనానికి నివాసాన్ని
జ్ఞానదీప్తి ప్రకాశాలతో
ఎన్నెన్నో కొలువులతో
ఆదరించే అక్షయ పాత్రను
విశాఖను నేను
శాంతికి చిహ్నాన్ని
రంగు రంగుల చిలుకలతో
చిన్ని చిన్ని పిచ్చుకలతో
అల్లుకున్న పోదరింటిని
కానీ ఈనాడు హుద్ హుద్ తుఫాను
నా మెడను వంచేసింది
తలను దించేసింది
అయినా చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో ఉన్నాను
నా బిడ్డలు దాన్ని ఓ గుణపాఠం గా తీసుకోని
నన్ను సక్రమంగా అభివృధి చేస్తారని!!!

1, అక్టోబర్ 2014, బుధవారం

అచేతనమైన ఆకాశానికి
అతి చంచలమైన చూపుని అతికించి
ఈ జనారణ్యం లో బ్రతుకెలా అని చూస్తూ ఉండిపోయింది
నలుపు రంగు పూసుకున్న
ఆ నీలాకాసం లోని నక్షత్రాలన్ని
నిన్నటి వరకు ఆమె కళ్ళలో మెరిసేవి
కాని ఆధునికత వీధుల్లో వెర్రి విహారం చేస్తున్న ఈనాడు
ఆమె మాత్రం
దురాచారాల జ్వాలలకు దిష్టిబొమ్మలా తగలబడిపోతూనే ఉంది
కామంధుల రక్కసి గోళ్ళకు బలై రక్తం చిందిస్తూనే ఉంది
కన్నీళ్ళతో జారిపోయిన ఆమె కలల్ని
తిరిగి కళ్ళకి అద్దుకునే ప్రయత్నం లో
ఎన్నో వెక్కిరింతలు, వెకిలి చూపులు
ఎదురుకుంటూనే ఉంది
ఇదే నాగరికత అంటే
సరే మనం నాగారీకులమే!!!